– ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష:ఎమ్మెల్యే ధర్మశ్రీ

– ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష
– చంద్రబాబు ఒక ఉన్మాదిగా వ్యవహరిస్తున్నాడు
– జోలెపట్టి ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నాడు
– చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌ మనుషులు వేరైనా వారిద్దరి మనస్సులు ఒకటే
– ఉత్తరాంధ్రలో తనను ఓడించారనే కక్షతోనే పవన్ అమరావతి పోరాటం అంటున్నాడు
– రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్థిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నిర్లక్ష్యం
– తన బినామీ భూములు అమరావతిలో వున్నాయనే చంద్రబాబు ఆరాటం
– సీపీఐ నారాయణ, రామకృష్ణ, జనసేన పవన్, నాదెండ్ల హైదరాబాద్ లో వుంటూ…
– అమరావతి కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ విమర్శించారు. గుంటూరుజిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్రపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్థిని సహించలేక ఉన్మాదిలాగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవం కట్టబెట్టారని చంద్రబాబు ఈ రకంగా మారిపోయాడని విమర్శించారు. చంద్రబాబు భూదాహంకు ఎన్ని వేల ఎకరాలు కావాలని నిలదీశారు. తన బినామీల భూములకు రేట్లు పోతున్నాయనే ఆవేదనతోనే అమరావతి ఉద్యమం పేరుతో రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఇరవై ఒక్క గ్రామాలు ముంపునకు గురవుతాయని చెన్నై ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చిన విషయం కాదంటారా అని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబుకు వాస్తవాలు అర్థం కావడం లేదా అని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జోలే పెట్టి రకరకాల విన్యాసాలకు పాల్పడుతున్నారని అన్నారు. జోలె పడితే ప్రజల నుంచి జాలి వస్తుందని సర్కస్ విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన విన్యాసాలను రాష్ట్రప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జోలె పట్టిన డబ్బుతో ఉత్తరాంధ్రను అణగదొక్కాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బినామీ భూములు ఉత్తరాంధ్రలో లేవనే అక్కసుతోనే మా ప్రాంతంను అభివృద్థి కాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆయన బృందాన్ని రాజకీయంగా సమాధి కట్టేందుకు ఉత్తరాంధ్రవాసుల సిద్దంగా వున్నారని హెచ్చరించారు. చంద్రబాబు అమరావతిని ముందుకు తీసుకువెడతానని గ్రాఫిక్ బొమ్మలు చూపించి రైతులను మభ్య పెట్టారని విమర్శించారు. అయిదేళ్లలో నిజంగా ఆ అభివృద్థిని ఎందుకు చూపించలేక పోయారని ప్రశ్నించారు. తన అనుకూల మీడియలో ఇక్కడ వున్న భవనాలనే రకరకాలుగా ఫోటోలు తీయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రజ్యోతి, ఈనాడులో ఈ రకమైన మభ్యపెట్టే ప్రచారం చేయించుకుంటూ… తప్పుడు ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధానిలో పండుగ వాతావరణం వున్నా.. రైతులను అడ్డం పెట్టుకని పండుగ మాకు దండుగ…అంటూ రైతుల సంతోషాలను కూడా చంద్రబాబు హరించివేస్తున్నారని విమర్శించారు. తాను చేస్తున్న ఈ ప్రేరేపిత పోరాటానికి తెలుగుదేశం అని కాకుండా జెఎసి అనే పేరుతో ఎందుకు రైతుల్లోకి వెడుతున్నారని ప్రశ్నించారు. ముంపునకు గురయ్యే అమరావతి ప్రాంతంలో ఏ రకంగా రాజధానిని నిర్మిస్తారని నిలదీశారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం అంటున్న చంద్రబాబు రాష్ట్రంను నాశనం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు అరాచకాన్ని అడ్డుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు మా సీఎం వైఎస్ జగన్ గారు చేస్తున్న ప్రయత్నాలను జీర్ణించుకోలేక చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు వెనుకబటుతనంతో వున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలు ప్రభుత్వ వికేంద్రీకరణ నిర్ణయంతో అభివృద్థి చెందుతాయని అన్నారు. అందుకోసం ఇక్కడి అమరావతిని తరలిస్తున్నట్లు చంద్రబాబు, పవన్, నాదెండ్ల మనోహర్, వారి భజనబృందం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నాదెండ్ల, రామకృష్ణ, నారాయణ, పవన్ కళ్యాన్‌ లు హైదరాబాద్ లో వుంటూ… అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. వారి నిజస్వరూపాన్ని ప్రజలముందు వుంచుతామని అన్నారు.
విశాఖలో తక్కువ ఖర్చుతో సెక్రటేరియట్ ఏర్పాటవుతుందని అన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయ రగడ, ప్రాంతీయ చిచ్చును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వారు అభివృద్దిని కోరుకోవడం తప్పా అని ప్రశ్నించారు. నలబై ఏళ్ల పాటు కనీస అభవృద్ధి లేక, వలసలతో, పస్తులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ కొనసాగుతోందని అన్నారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం అంటూ పండుగలు ఎవరూ చేసుకోవద్దు, నాతో పాటు మీరు నడవండి… పండుగ అంటే.. దండుగ అంటూ చంద్రబాబు ప్రజలకు తప్పుడు సందేశాలు ఇస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖకు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. అమరావతిలో రూ. 1.09 లక్షల కోట్లతో రాజధాని నగరంను ఎలా నిర్మిస్తారు… అది సాధ్యమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సీఎం సీటు పోయిందని రాష్ట్ర ప్రజలకు చేటు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య, సొంత మామనే వెన్నుపోటు పోడిచిన చంద్రబాబుకు రైతులను వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా అని అన్నారు. ఎవరైనా రైతులు మా ప్రాంత అభివృద్దికోసం ఉద్యమిస్తారని, కానీ చంద్రబాబు తన బినామీల భూములకు రేట్లు పెరగడం కోసం పోరాటం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర విభజన తరువాత లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు పడుతోందని, రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశాడని ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ విమర్శించారు. అమరావతి రాజధాని అంటూ గ్రాఫిక్ బొమ్మలతో గొప్పలు చెప్పుకుంటూ… అప్పులతో రాష్ట్రంను అథోగతి పాలు చేశాడని ఆరోపించారు. విశాఖపట్నంకు ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ వస్తే… అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో వున్నాయని అన్నారు. తక్కువ పెట్టుబడితో చక్కని అభివృద్థిని సాధించవచ్చని అన్నారు. దీనిని అడ్డుకోవడానికి చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమరావతిపై తమకే ప్రేమ వున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ లకు చిత్తశుద్ది వుంటే ఈ రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్ట్ లపై పోరాటం చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్ట్ లను సత్వరం పూర్తి చేయాలని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం వంటి అంశాలపై పోరాటం చేస్తే… ప్రజలు వారిని అభినందించే వారని అన్నారు. దానికి భిన్నంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ఎగ్జిక్యూటీవ్, జ్యుడీషియల్ కేపిటల్స్ రాకూడదంటూ చేస్తున్న ప్రేరేపిత పోరాటం వారి నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయని అన్నారు. విశాఖ రాజధాని అయితే అనేక ఉద్యోగాలు వస్తాయని, పరిశ్రమలు అభివృద్థి చెందుతాయని అన్నారు రాష్ట్రంలోనే అత్యథికంగా రెవెన్యూ వచ్చే జిల్లా విశాఖపట్నం అని, వికేంద్రీకరణ వల్లే రాష్ట్రం మరింత అభివృద్థి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్థి చెందాలని, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. అందుకోసమే ప్రభుత్వం ప్రతిరోజూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోందని, రైతులతోయ మంత్రులు భేటీ అవుతున్నారని అన్నారు. ఒప్పందం ప్రకారం రైతులకు అమరావతి ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చి వారిని న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
ఒక్కడే తినాలని అనుకుంటే రాక్షసుడు అవుతాడని, తనతోపాటు అందరూ తినాలని అనుకుంటే దేవుడు అవుతాడని అన్నారు. చంద్రబాబు తాను ఒక్కడే తినాలని భావిస్తున్నాడని, సీఎం శ్రీ వైఎస్ జగన్ అందరూ బాగుండాని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు, ఆయన బినామీలకు రేట్లు పెరగాలి, ఉత్తరాంధ్ర వాళ్లు వెనుకబాటుతోనంతోనే వుండాలని చంద్రబాబు అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా వుంటోందని అన్నారు. అమ్మ ఒడి ద్వారా ఏడువేల కోట్లు ఖర్చు చేసిన విషయం ప్రజల్లోకి వెళ్లకూడదని, రైతు భరోసా ప్రజల్లోకి వెళ్ళకూడదనే దురుద్దేశంతో అమరావతిలో చంద్రబాబు రగడను సృష్టించారని విమర్శించారు. తనకు అనుఊలమైన ఆంధ్రజ్యోతి, ఈనాడులో మద్దతుగా కథనాలు రాయిస్తూ… ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ పత్రికలు కూడా ఉత్తరాంధ్రలోని ప్రజల అభిప్రాయాలను కూడా పరిగనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క రాజధాని వద్దు.. .మూడు రాజధానిలు ముద్దు అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఆదరించలేదని ఇప్పుడు అమరావతి అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. పవన్, చంద్రబాబు మనుషులు వేరు కానీ, వారిద్దరి మనస్సులు ఒకటేనని అన్నారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమానికి తూట్లు పొడవాలనే వారిద్దరి ఉద్దేశమని అన్నారు. బిజెపిలోని విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ ను సమర్థిస్తున్నారని గుర్తు చేశారు. విశాఖకు ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ వస్తే.. ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెడతారని అన్నారు.