ఈత సరదా…. తీసిన బాలికల ప్రాణాలు

 

 

 

ఈత సరదా…. ఐదుగురు చిన్నారి బాలికల ప్రాణాలను బలిగొంది . ఈ విషాదకర సంఘటన వివరాలీలా ఉన్నాయి .    జోగులాంబ గద్వాల    జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలతో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన మేఘన (12), కవిత (12), చిన్నారి (10), వెంకటేశ్వరి (7), యు.చిన్నారి (7) అనే బాలికలు సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం సరదాగా ఊరికి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. బావిలో నీరు తక్కువగా ఉన్నాయని  ఈత కోసం రదాగా బావిలోకి   దిగారు.   ఒక్కసారిగా  ఓ బాలిక నీట మునిగిపోయింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు నీట మునిగిపోయినట్లు తెలుస్తోంది. బాలికలు బావిలో మునిగిపోయిన విషయాన్ని గమనించిన తోటి చిన్నారులు ఊర్లోకి పరుగెత్తుకెళ్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు. కానీ, చిన్నారులు అప్పటికే విగతజీవులుగా మారారు.
తమ చిన్నారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను బావిలోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి ఈ ఘటన విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు..