tdp manifesto, chandrababu naidu, elections 2019

ఇప్పుడేమంటావ్ బాబు.. వైరల్ అవుతున్న లెటర్

చంద్రబాబు నోటిలో ఎన్ని నాలుకలు ఉన్నాయో చెప్పగలరా? ఈ ప్రశ్నకు బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేడు. సందర్భానికి తగ్గట్టు తనకు ఇష్టమొచ్చినట్టు మాట మార్చేయడం బాబుకు బట్టర్ తో పెట్టినవిద్య. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడా యూటర్న్ ఉదంతాల్లోంచి ఓ కీలకమైన టర్న్ ను స్వయంగా కేంద్రమంత్రి పియూష్ గోయెల్ బయటపెట్టారు.

ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అంటూ గతంలో చంద్రబాబు కేంద్రానికి రాసిన ఓ లేఖను పియూష్ గోయల్ బయటపెట్టారు. 4 పేజీల ఆ లేఖ ప్రతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదికి 3వేల 5వందల కోట్లు చొప్పున ఐదేళ్లకు 17వేల 5వందల కోట్లు విడుదల చేయాలని ఆ లేఖలో స్వయంగా చంద్రబాబు ప్రతిపాదించారు. దీన్నిబట్టి ప్రత్యేక ప్యాకేజీకి తెరవెనక రూపకల్పన చేసింది బాబే అనే విషయం ఈ లేఖ ద్వారా అర్థమౌతోంది.

ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవితాలు బాగుంటాయి. కానీ తెలుగుదేశం తమ్ముళ్లకు ఏం ఉపయోగం ఉండదు. అందుకే బాబు తెలివిగా హోదా అంశాన్ని తప్పించి, ఆ స్థానంలో ప్యాకేజీని ప్రవేశపెట్టారు. నిధులొస్తే, రకరకాల పేర్లు చెప్పి వాటిని స్వాహా చేయొచ్చనేది బాబు కుతంత్రం. అందుకు తగ్గట్టే ఏపీకి వచ్చిన ఎన్నో నిధుల్ని తెలుగుదేశం తమ్ముళ్లు జుర్రేశారు.

అంతా అయిపోయింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడే ఉంది. సరిగ్గా టైమ్ చూసి బాబు యూటర్న్ తీసుకున్నారు. నెపాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేశారు. తప్పంతా కేంద్రానిదే అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఎలాగూ అను’కుల’ మీడియా చేతిలో ఉంది కాబట్టి తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్నారు. కానీ స్వయానా చంద్రబాబు రాసిన లేఖను పియూష్ విడుదల చేయడంతో, చంద్రబాబుకు యూటర్న్ కు స్పీడ్ బ్రేకర్ పడినట్టయింది. బాబు ఇప్పుడేం సమాధానం చెబుతారో చూడాలి.

Source: greatandhra