ఇక.. కొత్త కలయిక! డీఎంకేతో భాజపా పొత్తు?

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే – భాజపా కూటమి ఏర్పాటు అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కరుణానిధి ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆ రెండు పార్టీలను దగ్గరకు చేర్చడంతో పొత్తుకు పునాదులు పడుతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చేశాయి. తాజా పరిణామాలపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. చెన్నై వైఎంసీఏ మైదానంలో ఈ నెల 30న సాయంత్రం 4 గంటలకు కరుణానిధికి స్మృత్యంజలి కార్యక్రమం జరగనుంది. ఇందులో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, పలు పార్టీలకు చెందిన నేతలు దేవెగౌడ, శరద్‌పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, నితీశ్‌కుమార్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు కూడా డీఎంకే అధిష్ఠానం ఆహ్వానం పంపగా… ఆయన రాకపై మొదట్లో అనుమానాలు నెలకొన్నాయి. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు పాల్గొననుండటంతో అమిత్‌షా గైర్హాజరు కావచ్చని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని డీఎంకే అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఇప్పటికే డీఎంకే, భాజపాల పొత్తుపై సాగుతున్న ప్రచారానికి ఇది మరింత బలాన్నిస్తోంది. కరుణానిధి ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఆయన అంత్యక్రియల్లో డీఎంకే కూటమి పార్టీయైన కాంగ్రెస్‌ నేతలు కన్నా భాజపా నాయకులే ఎక్కువగా పాల్గొన్నారు. కరుణ మృతికి పార్లమెంట్‌లో సంతాపం తెలిపి సమావేశాలను వాయిదా వేశారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా డీఎంకేవైపు భాజపా అడుగులు వేస్తోందనే విశ్లేషణలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. తర్వాత డీఎంకే వైఖరి కూడా అదే తీరులో కనిపించింది. భాజపా సీనియర్‌ నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయీ మరణించడంతో డీఎంకే నేతలు స్టాలిన్‌, కనిమొళి, టీఆర్‌ బాలు, తిరుచ్చి శివ, దయానిధి మారన్‌ తదితరులు నేరుగా దిల్లీ వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. వాజ్‌పేయీ అస్థికలు చెన్నై చేరుకోగా… 23న భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయానికి స్టాలిన్‌, కనిమొళి వెళ్లి అంజలి ఘటించారు. ఈ పరిణామాలతో డీఎంకే, భాజపాలు దగ్గరవుతున్నాయని… లోక్‌సభ ఎన్నికలలో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయనే విశ్లేషణలకు మరింత ఊతం లభించింది. ఈ నేపథ్యంలో కరుణానిధి సంతాపసభకు అమిత్‌షా రానున్నట్టు డీఎంకే అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సభకు రాకపోవడం కూడా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవనుందనే ప్రచారానికి ఊతం లభిస్తోంది.
కొట్టిపారేస్తున్న కూటమి నేతలు
కరుణ సంతాపసభలో అమిత్‌షా పాల్గొననుండటంపై డీఎంకే కూటమి పార్టీలు స్పందించాయి. కానీ, కూటమి నాయకత్వాన్ని నొప్పించలేక సర్దుబాటు ధోరణితో అవి వ్యవహరిస్తున్నాయి. అమిత్‌షాకు స్టాలిన్‌ ఆహ్వానాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరంలేదంటూ డీఎంకే మద్దతుదారుడు శుభ.వీరపాండియన్‌ తెలిపారు. అమిత్‌ షా రావడం గురించో, రాకపోవడం గురించో పట్టించుకోవడంలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ తెలిపారు. సంతాపసభకు ఆయన వచ్చినా, రాకున్నా డీఎంకే కూటమిపై ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. భాజపా-డీఎంకే పొత్తు ఊహాగానం మాత్రమేనని, వాజ్‌పేయీకి నివాళులర్పించడం కోసమే తామంతా దిల్లీ వెళ్లినట్టు ఇప్పటికే డీఎంకే వివరణ ఇచ్చిందని ఎండీఎంకే ప్రధానకార్యదర్శి వైగో తెలిపారు. అయితే వీసీకే ఉప ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన వన్నియరసు మాత్రం ట్విట్టర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. సనాతన సిద్ధాంతాలను సుస్థిరం చేసేందుకు పోరాడే గుంపునకు చెందిన అమిత్‌షా ద్వారా కలైజ్ఞర్‌కు స్మృత్యంజలి అర్పించడం హేతువాద పూల దుకాణానికి వర్ణాశ్రమ బురదను చల్లడమేనని ఘాటుగా అభివర్ణించారు. చెన్నైలో కరుణానిధి శాసనసభలోకి అడుగుపెట్టిన 50 వసంతాలైన, ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా 2017 జూన్‌ 3న చెన్నైలో నిర్వహించిన వేడుకలకు అప్పట్లో పలువురు జాతీయనేతలను డీఎంకే ఆహ్వానించింది. కానీ భాజపాను మాత్రం విస్మరించింది. ద్రావిడ పార్టీలను నిర్మూలించాలనుకునే భాజపాను ఎందుకు ఆహ్వానించాలనే అభిప్రాయాన్ని అప్పట్లో స్టాలిన్‌ వెల్లడించారు. ప్రస్తుత సంతాప సభకు భాజపా జాతీయ అధ్యక్షుడిని ఆహ్వానించడంలో ఆంతర్యమేంటి? వాజపేయీ అస్థికలకు నివాళులర్పించడం ఎలాంటి హేతువాదం? అనే విమర్శలు కూడా తెరపైకి వచ్చాయి.

సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యల కలకలం
భాజపా, డీఎంకే పొత్తుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్‌ ఒకటి కలకలం రేపింది. కరుణ సంతాప సభలో అమిత్‌షా పాల్గొనకూడదని నిర్ణయించుకోవడం ఆహ్వానించదగిందని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ఒక్కసారిగా ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో మరో కలకలానికి దారితీసింది. అయితే అది భాజపా అధికారిక పేజీ కాదంటూ ఆ పార్టీ సాంకేతిక విభాగం వివరణ ఇవ్వడం గమనార్హం.