ఇండియాకు ట్రంప్ తాజా వార్నింగ్!

తాము వద్దంటున్నా రష్యాతో ఇండియా రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. దీనిపై త్వరలోనే తాను ఏ నిర్ణయం తీసుకోబోతున్నానో ఇండియాకు తెలుస్తుందని ట్రంప్ అన్నారు. 500 కోట్ల డాలర్ల విలువైన ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇండియా వచ్చిన సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా కొత్తగా సవరణ చేసిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడికి మాత్రమే ఇప్పుడు ఇండియాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ డీల్‌పై మీరు ఏం చేయబోతున్నారు అని ట్రంప్‌ను ప్రశ్నించగా.. ఇండియాకు త్వరలోనే తెలుస్తుంది అని అన్నారు. ఎప్పుడు అని అడగగా.. మీరు ఊహించిన దాని కంటే త్వరగానే ఆ నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు.