ఇంటెలిజెన్స్ డీజీనే కాదు.. ఏపీ డీజీపీని కూడా మార్చండి!: ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు!

ఇంటెలిజెన్స్ డీజీనే కాదు.. ఏపీ డీజీపీని కూడా మార్చండి!: ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ నేతలు!

ఆంధ్రప్రదేశ్ లో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కూడా పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని మరోసారి కలుస్తామని స్పష్టంచేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంపై టీడీపీ ఎందుకు గగ్గోలు పెడుతోందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు.

ఏపీలో సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్‌ తమ గోడు విందని, ఏబీ వెంకటేశ్వరరావుపై వేటును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించడం వెనుక వెంకటేశ్వరరావు ఉన్నారని ఆరోపించారు. ఈసీ తీసుకున్న చిన్న చర్యకు కూడా టీడీపీ గగ్గోలు పెడుతోందని సజ్జల అన్నారు. హైకోర్టులో టీడీపీ వాదనలు నిలబడవన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.