ఇంటికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పి గెంటేసిన భర్త!

ఇంటికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పి గెంటేసిన భర్త!

యూపీలోని ఇటావాలో దారుణం
పోలీసులను ఆశ్రయించిన వివాహిత
కేసు నమోదుచేసిన అధికారులు
ట్రిపుల్ తలాక్ ఇవ్వడం నేరమని కేంద్రం చట్టం చేసినా కొందరు వ్యక్తులు మాత్రం మారడం లేదు. చిన్నచిన్న కారణాలకే భార్యకు విడాకులు ఇస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. తాజాగా పుట్టింటికి వెళ్లిన భార్య 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఆగ్రహించిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఇటావా నగరంలో చోటుచేసుకుంది.

ఇటావాలో ఉంటున్న ఓ మహిళ అదే పట్టణంలో ఉంటున్న తన అమ్మమ్మను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. అయితే కుటుంబ సభ్యులను కలుసుకుని 30 నిమిషాల్లోగా తిరిగిరావాలని ఆమె భర్త హుకుం జారీచేశాడు. అయితే సదరు వివాహిత మాత్రం భర్త చెప్పినట్లు కాకుండా ఓ 10 నిమిషాలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. దీంతో కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయిన సదరు వ్యక్తి.. భార్యకు ఫోన్ చేసి మూడు సార్లు.. తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

దీంతో షాక్ కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గతంలో కట్నం తీసుకురాలేదన్న కారణంతో తనను అత్తింటివారు తీవ్రంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ వేధింపులతో తనకు గర్భస్రావం కూడా అయిందని వెల్లడించింది. తన తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో పెద్దగా కట్నకానుకలు ఇచ్చుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.