kcr and ys jgan mohan reddy

ఆ ఇద్ద‌రు ఒక‌టైతే.. రాజ‌కీయ‌ ఫార్ములా మారుతుందా..?

తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ హైద‌రాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసం ప్ర‌గ‌తి భ‌వన్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంపై ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో కీల‌కంగా దృష్టి పెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా సోద‌ర భావంతో ముందుకు సాగాలని రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు కోరుకుంటున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ నిర్ణ‌యాలను ప్ర‌తిప‌క్షం విమ‌ర్శించినా వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా గోదావ‌రి నదీ జ‌లాల‌కు సంబంధించి రెండు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టుల‌ను ప్ర‌తిపాదిస్తున్నాయి.

ఇవి అత్యంత కీల‌కం. రాబోయే 100 సంవత్స‌రాల‌ను ప్రామాణికంగా తీసుకుని రెండు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుల‌కు ప్రాణం పోస్తున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఇవే ప్ర‌భుత్వాలు, ఈ సీఎంలే ఈ రాష్ట్రాలకు ఉంటార‌నే అవ‌కాశం లేనందున ఈ విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది నిపుణులు చెబుతున్న మాట‌. ఇదే విష‌యం గ‌త ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం టీడీపీ లేవ‌నెత్తిన‌ప్పుడు.. జ‌గ‌న్ ఓ మాట చెప్పారు. ఇదేదో కేసీఆర్ ఇంట్లోనో.. నా ఇంట్లోనో జ‌రిగే స‌మావేశం కాదు… అధికారికంగా ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి ఓ కీల‌క ఒప్పందం చేసుకుని ముందుకు సాగుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

అయితే, ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్ వ్యాఖ్య‌లు కొంత మేర‌కు అనుమానం రేకెత్తించేలా క‌నిపిస్తున్నాయి. గోదావ‌రి నీటిని ఒడిసిప‌ట్ట‌డంలో క‌డుతున్న ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ భూభాగంలో ఉండేలా ఆయ‌న చూస్తున్నారు. అయితే, దీనికి సంబంధిచిన నిదులు మాత్రం కుదిరితే కేంద్రం లేక పోతే, ఇరు రాష్ట్రాలు భ‌రించాల‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇది రాబోయే త‌రాల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామం అవుతుంది.

మ‌రో హైద‌రాబాద్ మాదిరిగా ఈ ప్రాజెక్టులు మారిపోతే.. రాబోయే రోజుల్లో వివాదాలు త‌లెత్తితే ఎవ‌రు బాధ్యులు అనే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు ఖ‌చ్చితంగా జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు రాష్ట్రాల‌కు స‌మానంగా న్యాయం జ‌రిగేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది నిర్వివాదాంశం. మ‌రి ఆదిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తారో లేక కేసీఆర్ ఉచ్చులో ప‌డ‌తారో ? చూడాలి.