ఆ ఇద్దరు దోషులే

హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో 2007 ఆగస్టు 25న జరిగిన జంటపేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా తేలుస్తూ నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న ఐదుగురు నిందితుల్లో అనిక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరీని దోషులుగా నిర్ధారించింది. ఫారూఖ్ షర్ఫుద్దీన్, సాధిక్ ఇస్రార్ అహ్మద్‌ను నిర్దోషులుగా ప్రకటించింది. మరో నిందితుడు సహా దోషులకు న్యాయస్థానం ఈ నెల 10వ తేదీన శిక్షలు ఖరారు చేయనున్నది. లుంబినీ పార్కులో పేలిన బాంబును అనిక్ షఫీక్ సయీద్, దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబును అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ పెట్టినట్టు తేలింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్‌రాజా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. రియాజ్ భత్కల్ గోకుల్ చాట్‌లో బాంబు పెట్టినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. 11 ఏండ్ల కిందట జరిగిన జంట పేలుళ్లలో మొత్తం 44 మంది మృతి చెందగా, 68 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వివరాలు 10వ పేజీలో
హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్‌లో 2007లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు వచ్చే సోమవారం శిక్ష ఖరారుచేయనున్నది. నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన మరో నిందితుడికి సంబంధించి సోమవారం తీర్పు ఇవ్వనున్నది. మంగళవారం చర్లపల్లిలోని సెంట్రల్‌జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో జంట పేలుళ్ల కేసు విచారణ జరిగింది. నిందితులు అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ, అనిక్ షఫీక్ సయీద్, ఫారూఖ్ షర్ఫుద్దీన్, సాధిక్ ఇస్రార్ అహ్మద్, తారీక్ అంజుమ్‌ను పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి టీ శ్రీనివాస్‌రావు గత నెల 27వ తేదీన పూర్తయిన విచారణపై తీర్పు వెల్లడించారు. మొదటి నిందితుడిగా ఉన్న అనిక్ షఫీక్ సయీద్, రెండో నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ చౌదరీపై పొం దుపరిచిన అభియోగాలు రుజువుకావడంతో వారిని దోషులుగా ప్రకటించారు. ఏ5- ఫారూఖ్ షర్ఫుద్దీన్, ఏ6-సాధిక్ ఇస్రార్ అహ్మద్‌పై ఉన్న అభియోగాలు రుజువుకాకపోవడంతో నిర్దోషులుగా తేల్చారు. ఈ కేసులో ఏ3-రియాజ్ భత్కల్, ఏ4-ఇక్బాల్ భత్కల్, ఏ7- అమీర్‌రాజా ఇంకా పరారీలో ఉన్నారు. 11 ఏండ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు సంతోషం నింపినా, ఇద్దరు నిర్దోషులుగా తేలడం అసంతృప్తిని మిగిల్చిందని బాధితులు చెప్తున్నారు. తుది తీర్పు సందర్భంగా చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

286 మంది సాక్ష్యులు.. వెయ్యికిపైగా పత్రాలు
2007 ఆగస్టు 25న రాత్రి 7:32 గంటలకు లుంబినీ పార్క్ లో, 7:47 గంటలకు గోకుల్ చాట్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగి మొత్తం 44 మంది మృతి చెందగా, 68 మంది తీవ్రం గా గాయపడ్డ సంగతి తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్డి వద్ద ఓ పేలని బాంబు దొరికింది. ఈ పేలుళ్లపై పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్)కు బదిలీ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టి ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడినట్టు తేల్చి, ఏడుగురు నిందితులను గుర్తించింది. వీరికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజుమ్‌పై ఇదే కేసులో వేరుగా అభియోగం నమోదుచేసింది. దర్యాప్తులో అనిక్ షఫీక్ సయ్యిద్ లుంబినీపార్క్‌లో, రియాజ్ భత్కల్ గోకుల్ చాట్‌లో, అక్బర్ ఇస్మాయిల్ చౌదరీ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టినట్టు తేలింది. మూడేండ్ల తర్వాత ఐదుగురు నిందితులను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారు. గోకుల్ చాట్‌లో బాంబు పెట్టిన రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. 11 ఏండ్ల పాటు సాగిన విచారణలో పోలీసులు మొత్తం 286 మంది సాక్ష్యులను విచారించి వెయ్యికిపైగా పత్రాలను ఆధారాలుగా కోర్టులో సమర్పించారు. మంగళవారం తుది తీర్పు వెలువడింది. కోర్టు వెలువరించిన తీర్పు వివరాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సురేందర్, చల్లా శేషురెడ్డి వివరించారు. తుది తీర్పు కాపీ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దోషుల విషయంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే విషయంపై సమీక్షిస్తామన్నారు. మరోవైపు ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇచ్చింది: చందర్, బాధితుడు
కోఠిలో పుస్తకాలు కొని తిరిగి వస్తుండగా గోకుల్‌చాట్‌లో పేలు డు జరిగి ఓ ఇనుప గుండు నా కుడి కంటిలోకి దూసుకుపోయిం ది. అప్పటి నుంచి నా ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పటికీ దవాఖానల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించినా ఎలాంటి సహా యం అందలేదు. కేంద్రం రూ.3 లక్షలు ప్రకటించినా రూపాయి కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.5 లక్షలు ఇచ్చింది. మిగతా నగదు కూడా అందితే ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. పేలుళ్లలో గాయపడిన వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. బాధితులందరం కలిసి టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్ అసోసియేషన్‌గా ఏర్పడి ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నాం. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు వచ్చిన తీర్పు సగం సంతోషాన్నే ఇచ్చింది.