ఆర్థిక మంత్రి నిద్రపోతున్నారా?

డీఆర్‌టీ మూసివేతపై హైకోర్టు ఆగ్రహం
ఆర్థిక రాజధాని ముంబయిలో రుణ రికవరీ ట్రైబ్యునల్‌(డీఆర్‌టీ) పనిచేయకపోవడంపై బోంబే హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడి కార్యాలయం నెల రోజుల నుంచీ మూసివేసి ఉండడంపై అసంతప్తిని వెలిబుస్తూ ‘దేశ ఆర్థిక మంత్రి నిద్రపోతున్నారేమో తెలుసుకోవాలి ఉంద’ని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌. ఓకా, జస్టిస్‌ రియాజ్‌ చాగ్లాతో కూడిన ధర్మాసనం డెట్స్‌ రికవరీ ట్రైబ్యునల్‌ బార్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ట్రైబ్యునల్‌ కార్యాలయానికి దక్షిణ ముంబయిలో మరో స్థలాన్ని కేటాయించాలని పిటిషన్‌లో ఆ సంఘం కోరింది. సిందియా హౌస్‌ వద్ద గల బలార్డ్‌ ఎస్టేట్‌ భవనంలోని డీఆర్‌టీ కార్యాలయంలో జూన్‌ 2న అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు. కాగా, ట్రైబ్యునల్‌కు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎప్పుడు గుర్తిస్తారో కేంద్ర ప్రభుత్వం తెలపాలని ధర్మాసనం కోరింది. ‘ప్రభుత్వం ఇవన్నీ ముందే చూసుకోవాలి. మా వద్దకు వచ్చి.. మేం ఆదేశాలు ఇచ్చేంత వరకు వేచిచూడడం సబబు కాద’ని జస్టిస్‌ ఓకా హితవు పలికారు. ‘దేశ ఆర్థిక రాజధానిలో రుణ రికవరీ ట్రైబ్యునల్‌ పనిచేయడం లేదా.. ఆర్థిక మంత్రి నిద్రపోతున్నారా ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. జులై 25కు పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ అప్పటిలోగా ట్రైబ్యునల్‌కు తగిన చోటును గుర్తించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.