‘ఆయుష్మాన్ భారత్‌’కు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య కార్యక్రమం.. ఆయుష్మాన్ భారత్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ప్రారంభించారు. ప్రభాత్ తారా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తొలుత కొందరు లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో భారత్ సరికొత్త మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. ఈ తరహా బృహత్ ఆరోగ్య కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ (పీఎంజీఏవై) పథకానికి ప్రజలు మోదీ కేర్ అంటూ పలురకాల పేర్లు పెడుతున్నారని, కానీ తాను మాత్రం దీనిని పేద ప్రజలకు సేవచేసే అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. సమాజపు అట్టడుగు వర్గాలకూ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో వైద్యరంగంలో ఉన్నవారు ఈ పథకాన్ని బట్టి తమ తమ కొత్త స్కీములను తీసుకువస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13వేల దవాఖానలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి.
గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటివాటితోపాటు మొత్తం 1300 రకాలైన వ్యాధులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రపంచంలో అమలవుతున్న అతిపెద్ద ప్రభుత్వం పథకం ఇదే. అమెరికా, కెనడా, మెక్సికో.. ఈ మూడుదేశాల మొత్తం జనాభాకన్నా ఎక్కువగా భారత్‌లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు అని మోదీ చెప్పారు. దేశంలోని ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో 2500 ఆధునిక దవాఖానలు రానున్నాయని, వీటిద్వారా ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయని మోదీ వివరించారు. దేశంలో 50కోట్లమంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా రని, పేదల ఆశీస్సులతో యంత్రాంగం రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కాంగ్రెస్‌పైనా ప్రధాని విమర్శలు గుప్పించారు. గరీబీ హటావో అంటూ నినదించిన నేతలు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డారే తప్ప పేదల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని దుయ్యబట్టారు. తప్పుడు ఆరోపణలతో పేదలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, వారి ఆత్మగౌరవాన్నీ విస్మరించిందని మోదీ ఆరోపించారు.

కుల, మత తారతమ్యం లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దేశీయ వైద్యరంగంలో మౌలిక మార్పులకు ఆయుష్మాన్ భారత్ కారణమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేడీ నడ్డా తెలిపారు. కార్యక్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్, గవర్నర్ ద్రౌపది ముర్ము తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ర్టాల్లోని 445 జిల్లాల్లో, 1280 దవాఖానల్లో ఆదివారంనాడు ఏకకాలంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు సంబంధించి ఈ పథకాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో ప్రారంభించారు. ఈ పథకం పేదలకు మోదీ కవచం వంటిదని పేర్కొన్నారు.

ఆయుష్మాన్ భారత్‌కు రూపకల్పన ఇలా..
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) 71వ నివేదిక ప్రకారం.. 85.9శాతం గ్రామీణ కుటుంబాలు, 82 శాతం పట్టణ కుటుంబాలు వైద్యబీమా పరిధిలో లేవు. గ్రామీణ భారతంలో 24శాతం, పట్టణాల్లో 18శాతం కుటుంబాలు తమ వైద్య అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బృహత్ ఆరోగ్యబీమా పథకం దేశానికి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అలా రూపొందిందే ఆయుష్మాన్ భారత్. అమెరికాలో ఆదరణ పొందిన ఒబామా కేర్ పథకం స్ఫూర్తితో రూపకల్పన చేసినప్పటికీ, దేశీయ అవసరాలకు తగ్గట్టు దీనిలో మార్పులు చేశారు. 2018 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మొదటగా ఈ పథకాన్ని ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్‌కు 60 శాతం నిధుల్ని కేంద్రం అందించనుండగా, ఆయా రాష్ర్టాలు మిగిలిన 40శాతాన్ని భరించాల్సి ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో కేంద్రం 90శాతం నిధులను అందివ్వనుండగా, ఆయా రాష్ర్టాలు 10శాతం నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి నిధుల్ని కేంద్రమే సమకూరుస్తుంది. 30రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పథకం అమలుకు సిద్ధమయ్యాయి. ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా మేలైన ఆరోగ్యపథకాలు అమల్లో ఉన్న కారణంగా తెలంగాణ, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పంజాబ్ కేంద్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు. మొత్తం 15,686 దరఖాస్తులకుగాను, వాటిలో 8,735 ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలో చేర్చారు.

ఆయుష్మాన్ మరొక మాయ: కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం మరొక మాయ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఇది మరొక తెల్ల ఏనుగుగా మారుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని 50 లక్షల కుటుంబాల్లో కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఎవరు అర్హులు?
సామాజిక, ఆర్థిక, కుల జనగణన (ఎస్‌ఈసీసీ) గణాంకాల ప్రకారం.. 8.03కోట్ల గ్రామీణ, 2.33కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఆయుష్మాన్ భారత్‌కు అర్హత పొందుతాయి. ఈ సర్వే జాబితాలోని డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 క్యాటగిరీల్లో మీ పేరు నమోదై ఉంటే, మీరు, మీ కుటుంబం ఈ పథకానికి అర్హులే. ఇక పట్టణప్రాంతం వారైతే అదనంగా 11 ఉద్యోగపరమైన అంశాల్లో లబ్ధిదారుడి కుటుంబం ఉండాల్సి ఉంటుంది. వీటితోపాటు రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) అమలువుతున్న రాష్ర్టాల్లోని లబ్ధిదారులు కూడా ఆయుష్మాన్ భారత్‌లోకి వస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్యపై, వయసుపై ఎలాంటి పరిమితి లేదు. ఈ పథకానికి ఆధార్ తప్పనిసరి కాదు.
గుర్తింపును ధ్రువపరిచే ఎన్నికల కార్డు లేదా రేషన్‌కార్డు సరిపోతుంది. లబ్ధిదారుడు ఏడాదికి రూ.5లక్షల వరకు ఆరోగ్యబీమాను పొందుతారు. ఈ పథకం కింద 1354 రకాల వ్యాధులకు చికిత్స పొందవచ్చు. బైపాస్ సర్జరీ, స్టెంట్లు, మోకాలి చిప్పల మార్పిడి వంటి శస్త్రచికిత్సలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కన్నా 15-20శాతం తక్కువ ధరకే పూర్తిచేసుకోవచ్చు. డబ్బు ప్రమేయం, కాగితాల వ్యవహారమేదీ లేకుండా ఈ పథకం కింద లబ్ధిపొందవచ్చు. వీరి కోసం ప్రత్యేకంగా 14555 అనే హెల్ప్‌లైన్ నెంబరును ఏర్పాటు చేశారు.

నిర్వహణ ఓ సవాల్..
ఆయుష్మాన్ భారత్ పథకం అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ, దాని నిర్వహణ ప్రభుత్వానికి ఓ సవాల్‌గా నిలువనున్నది. ఇలాంటి పథకాన్ని అమలు చేయడానికి నిస్సందేహాంగా సాహసోపేతమైన నిర్ణయాలు కావాలి అని బ్రిటిష్ మెడికల్ జర్నల్ లాన్సెట్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని ప్రధాన ప్రచారాంశంగా వాడుకోవాలని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో.. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో పథకాన్ని పట్టాలెక్కించడం, పరుగుపెట్టించడం అంత సులువు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వసతుల లేమి, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్న ప్రభుత్వ వైద్యశాలల్ని ఈ పథకం కోసం మెరుగుపర్చడం, 2020నాటికి దేశవ్యాప్తంగా లక్షా50వేల వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఆశామాషీ కాదు.