‘ఆపరేషన్ పల్నాడు’.. సమస్యాత్మక గ్రామాలను దత్తత తీసుకున్న ఏపీ పోలీసులు!

  • ఒక్కో అధికారికి ఒక్కో సున్నిత గ్రామం అప్పగింత
  • ఈ ఊర్లలో పర్యటించిన గ్రామీణం ఎస్పీ జయలక్ష్మి
  • ఊరివాళ్లంతా సమైక్యంగా ఉండాలని హితవు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పల్నాడులో ఇటీవల ఉద్రిక్తత తలెత్తిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులను వైసీపీ లక్ష్యంగా చేసుకుంటోందనీ, గ్రామాల నుంచి తరిమేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం కూడా చేపట్టారు. దీన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తెలుగుదేశం ఏర్పాటుచేసిన శిబిరాల్లోని ప్రజలను తమ స్వగ్రామాలకు తరలించారు. ఈ నేపథ్యంలో పల్నాడులో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి ఆధ్వర్యంలో సమస్యాత్మక, సున్నితమైన పరిస్థితులు నెలకొన్న గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలను పోలీస్ అధికారులు దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఈ గ్రామాల్లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సంబంధిత అధికారినే బాధ్యుడిగా చేయనున్నారు.

మరోవైపు ఈ విషయమై ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. బయటివారు వచ్చి చెబితే రెచ్చిపోవడం కాకుండా గ్రామస్తుల మధ్య సమైక్యత ఉండాలని సూచించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతామని పేర్కొన్నారు.