ఆదినారాయణరెడ్డి మనిషికాదు, దుర్మార్గుడు: విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఆదినారాయణరెడ్డి మనిషికాదు, దుర్మార్గుడు: విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంలో వైఎస్సార్సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని సమూలంగా తుడిచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. లోటస్ పాండ్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆయన నిప్పులు చెరిగారు.

1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్ రాజారెడ్డి హత్యతో ఈ కుట్రలు మొదలయ్యాయని, రాజారెడ్డి హత్యకేసు నిందితులకు టీడీపీ ఆఫీసులో రక్షణ కల్పించారని ఆరోపించారు. ఆ కుట్రల్లో భాగంగానే వివేకా హత్య కూడా జరిగిందని అన్నారు.

” దీంట్లో ఆదినారాయణరెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి మనిషి కాదు దుర్మార్గుడు. ఏ మాత్రం విలువల్లేని వ్యక్తి. సరిగ్గా చెప్పాలంటే మనిషి జాతిలో అతడు పుట్టడం పట్ల ప్రతి మనిషి బాధపడాల్సిన విషయం. మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్విస్తారు. ఆదినారాయణరెడ్డి మాత్రం దుర్మార్గమైన వ్యక్తి. ఈ హత్యలో సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ అయితే, దీన్ని అమలుపరిచింది మాత్రం ఆదినారాయణరెడ్డి. ఆదినారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో చేయించిన ఘాతుకమే ఇది. దీనికి వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అందుకే వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కోరుతున్నాం” అంటూ స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.