ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇక ఆర్ధిక ఎమ‌ర్జెన్సీ?

Share This

విచ్చ‌ల‌విడిగా అప్పులు చేసి దుబారా ఖ‌ర్చును ఆకాశం ఎత్తుకు పెంచిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆర్ధిక య‌మ‌ర్జెన్సీ విధించే ప‌రిస్థితులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు దాదాపుగా రూ.32 వేల కోట్ల మేర‌కు ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద సాధార‌ణ, అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు త‌ప్ప ఒక్క పైసా కూడా అద‌నంగా లేదు. దాంతో కాంట్రాక్ట‌ర్ల బిల్లులు ఎలా చెల్లించాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఇక నుంచి దుబారా ఖ‌ర్చులు త‌గ్గించుకుని ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఇప్పుడున్న పెండింగ్ బిల్ల‌లు చెల్లించాలంటే క‌నీసం ఒక ఆర్ధిక సంవ‌త్స‌రం ప‌డుతుంది. అంటే రాష్ట్ర ఖ‌జానా ఎంత‌గా గుల్ల అయిందో అంచ‌నా వేసుకోవ‌చ్చు. ఆర్ధిక శాఖ మంత్రిగా ఎంతో అనుభ‌వం ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఉన్నారు. మ‌రి ఆయ‌న అధికారంలో ఉండి ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌కుండా మోడీ జ‌గ‌న్‌లు ఈ ప‌రిస్థితికి కార‌ణం అని ఎందుకు చెబుతున్నారో అర్ధం కావ‌డం లేదు. ఆర్ధిక శాఖ‌లో ఎలాంటి అనుభం లేని ఒక జూనియ‌ర్ అధికారి అయిన ముద్దాడ ర‌విచంద్ర‌ను ఆర్ధిక శాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మిచుకుని అన్ని కీల‌క బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కే అప్ప‌గించారు. ఆయ‌న‌ 2017 ప్ర‌ధ‌మార్ధంలో చార్జి తీసుకోగా ఆ నాటి నుంచి ప్ర‌భుత్వం ఓవ‌ర్ డ్రాఫ్ట్ పైనే న‌డుస్తున్న‌ద‌నేది వాస్త‌వం కాగా దాన్ని క‌ప్పిపుచ్చేందుకు ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలో ఉన్న‌వారికి అల‌వాటు అయిపోయింది.

ప్ర‌భుత్వం న‌డ‌పాల్సిన కీల‌క విష‌యాల‌లో ప్ర‌యివేటు వ్య‌క్తుల‌ను నియ‌మించుకోవ‌డం కూడా ఈ దుస్ధితికి కార‌ణం. ఆర్ధిక కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న ముద్దాడ ర‌విచంద్ర‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఈ విష‌యాల‌పై ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న శెల‌వుపై వెళ్లిపోయిన విష‌యం స‌త్యంన్యూస్ వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ముద్దాడ ర‌విచంద్ర స్థానంలో పీయూష్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దాంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు చేస్తున్న ఒక్కొక్క త‌ప్పు, మ‌డ‌త‌పేచీలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో రూ.32,000 కోట్లు అప్పు ప‌రిమితి కావాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరాగా అలా అనుమ‌తి ఇస్తే ఆర్ధిక‌లోటును పూడ్చుకునే ఎఫ్ ఆర్ బి ఎం నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన‌ట్లు అవుతుంద‌ని చెబుతూ రాష్ట్ర ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తిని కేంద్ర ఆర్ధిక శాఖ తిర‌స్క‌రించింది. దాన్ని రూ.24,000 కోట్లుగా నిర్దారించింది.

అయితే ప్ర‌ధ‌మార్ధం ప్రారంభంలోనే రూ.8,000 కోట్లు అప్పుకావాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరి రూ.5,000 కోట్లు ఇప్ప‌టికే తెచ్చేసుకుని ఖ‌ర్చు చేసేసింది. బ‌డ్జెట్ ప్ర‌ధ‌మార్ధంలోనే అప్పు తెచ్చుకుంటే ఇక రానున్న మూడు త్రైమాసికాలు ఏ విధంగా నిర్వ‌హిస్తారో ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడేచెప్పాలి. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం కోసం రూ.1.91 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌గా ఖ‌ర్చు రూ.2.40 ల‌క్ష‌ల కోట్లు దాటింది. 2018 న‌వంబ‌ర్ నుంచి రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి దివాలా అంచునే ప‌య‌నిస్తున్న‌ది. అయినా ఎలాంటి దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోలేదు. జీత‌భ‌త్యాలు త‌దిత‌ర అనివార్య ఖ‌ర్చులు పోను దాదాపుగా 24 వేల కోట్ల రూపాయ‌ల లోటు ఉంటుంద‌ని ఆరు నెల‌ల ముందుగానే అంచ‌నాలు వేసుకున్నా కూడా రాజ‌కీయ అనివార్య‌త‌ల వ‌ల్ల దుబారా చేస్తూనే పోయారు. ఇప్పుడు ఆ నెపాన్ని ఎవ‌రిపైన నెట్టాలా అని చూస్తూమోడీ జ‌గ‌న్‌ల‌ను విమ‌ర్శిస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక‌శాఖ విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తే అదుపు చేయ‌కుండా దుబారా పెంచితే ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌లుగుతారు? అదే మ‌ని ప్ర‌శ్నించే వారిని రాష్ట్ర అభివృద్ధి వ్య‌తిరేకులుగా చిత్రీక‌రిస్తూ ఆరోప‌ణ‌లు చేయ‌డం కూడా తెలుగుదేశం నాయ‌కుల‌కు అల‌వాటు అయిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నేరుగా ఎల్ వి సుబ్ర‌హ్మ‌ణ్యం ను నియ‌మించ‌డం, ఆయ‌న ప్ర‌తి అంశాన్నీ కూలంక‌షంగా ప‌రిశీలిస్తుండ‌టంతో ఒక్కో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ప‌రిస్థితి చేతులు దాటి పోయింది. దాంతో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముఖ్య‌మైన అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆయ‌న ఈ ప‌నులు చేస్తున్న‌కొద్దీ ఆయ‌న‌పై రాజ‌కీయ దాడులు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రెండు రోజుల కింద‌ట ట్రెజ‌రీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తే అందులో కూడా దారుణ‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ట్రెజ‌రీ విభాగంతో సంబంధం లేకుండా సిఎఫ్ ఎం ఎస్ చెల్లింపులు చేసేసింద‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది, ఈ రెండు విభాగాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కాదు క‌దా క‌నీసం సాంకేతికంగానైనా సంబంధం లేకుండా చేసి ఖ‌జానాను లూటీ చేశార‌ని ట్ర‌జ‌రీ అధికారులు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దృష్టికి తీసుకువ‌చ్చార‌ని విశ్వ‌స‌నీయంగా తెలిసింది.