ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు ముందుంది ముసళ్ల పండుగే

ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు ముందుంది ముసళ్ల పండుగే

ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోరాటానికి సిద్ధ‌మైంది. పొత్తులు లేకుండానే రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లోనూ పోటీకి దిగుతామంటూ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని ప్ర‌ధాని చేయ‌డ‌మ‌నే ల‌క్ష్యంతోనే పార్టీ ముందుకు సాగుతుంద‌న్నారు. ఆంధ్రాకు మేలు జ‌ర‌గాలంటే… కాంగ్రెస్ కి ఓటెయ్యాలంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇత‌రులు ఎవ‌రికి ఓట్లు వేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. టీడీపీతో అవ‌గాహ‌న కేవ‌లం జాతీయ రాజ‌కీయాల్లో మాత్ర‌మే ఉంటుంద‌ని కాంగ్రెస్ స్ప‌ష్టం చేసింది. నిజానికి, కాంగ్రెస్ తో రాష్ట్ర స్థాయిలో స‌ర్దుబాటు ఉండొద్దు అనేది టీడీపీ నేత‌ల్లో మొద‌ట్నుంచీ ఉన్న డిమాండ్‌.

భాజ‌పాకి ప్ర‌త్యామ్నాయం అనే కోణంలోనే రాహుల్ తో చంద్ర‌బాబు క‌లిశారు. ఏదేమైనా, కాంగ్రెస్ ఫైన‌ల్ గా ఒంట‌రి ప్ర‌యాణానికే నిర్ణ‌యించుకుంది. అయితే, ఈ క్ర‌మంలో కొన్ని స‌వాళ్లున్నాయి.మొద‌టిది ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం ఎలా ఉంటుంది..? ఆంధ్రాకు న్యాయం జ‌ర‌గాలంటే కాంగ్రెస్ తో మాత్ర‌మే అని ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యే అభ్య‌ర్థులు చెబుతారా..? రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయితేనే ఏపీకి మేల‌ని అంటారా..? ఒక‌వేళ అలా అంటే… అది జాతీయ స్థాయి రాజ‌కీయ అంశం అవుతుంది. అంటే, అదీ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మాత్రమే వ‌ర్తించే ప్ర‌చారాంశం అవుతుంది. మ‌రి, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు రాష్ట్రస్థాయి రాజ‌కీయాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏంటి..? ఏయే అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించి ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవాల‌ని కాంగ్రెస్ చూస్తుంది..? కాంగ్రెస్ చేయ‌బోయే ప్ర‌చారం టీడీపీ చేయ‌నున్న ప్ర‌చారాంశాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుందా..? ఉంటే పరిస్థితి ఏంటి. దీనిపై ఏపీ కాంగ్రెస్ కి ముందుగా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

రెండోది పార్టీ కేడ‌ర్ ప‌రిస్థితి ఏంటి.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత, రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేసే చ‌ర్యలేవీ తీసుకున్న దాఖ‌లాలు లేవు. పేరున్న నాయ‌కులే పార్టీలో లేకుండా పోయారు. ఇంకా కాంగ్రెస్ లో కొన‌సాగితే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే అభ‌ద్ర‌తాభావమే పార్టీని ఖాళీ చేయించింది. ఆ ఇమేజ్ ను మార్చ‌డం కోసం కాంగ్రెస్ చేసిన ప్ర‌య‌త్నం దాదాపు లేద‌నే చెప్పాలి. అన్నిటిక‌న్నా ముఖ్యంగా, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్న‌మూ జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఒంట‌రి పోరు అంటున్నారే… పార్టీ కేడ‌ర్ ప‌రిస్థితి ఏంటి..? క్షేత్రస్థాయిలో కార్య‌క‌ర్త‌లను ఎలా చేర‌దీస్తారు..? ఎన్నిక‌లు ఉన్న అతి త‌క్కువ స‌మ‌యంలో… ఊపు ఎలా తీసుకొస్తారు?ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ లో పేరున్న నాయ‌కులు ఎవ‌రున్నారు..? 175 మంది అభ్య‌ర్థులు ఎవ‌రు..? టీడీపీ, వైకాపా టిక్కెట్లు ద‌క్క‌నివారు.. మూడో ప్ర‌త్యామ్నాయంగా జ‌న‌సేన‌ను చూస్తున్న ప‌రిస్థితి ఉంది. అలాంట‌ప్పుడు, కాంగ్రెస్ లో ఉన్న సానుకూల‌త‌లు ఇవీ చూప‌డానికి కావాల్సిన అంశాలేంటి..? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ ఒంట‌రి పోరాటానికి దిగొచ్చుగానీ… స‌మ‌ర్థంగా పోరు సాగించాలంటే ఈ స‌వాళ్ల‌ను దాటుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.