ఆంధ్రప్రదేశ్ ఆరోవేలా!?

ఆంధ్రప్రదేశ్ ఆరోవేలా!?

{సురేష్ కుమార్ విజయనగరం నుంచి }

ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతున్నా కేంద్రానికి పట్టదా..రాజధాని విషయంలో ఆంధ్ర ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి గత కొన్నిరోజులుగా ఆందోళనలతో రాష్ట్రం దద్దరిల్లిపోతుంటే కేంద్రప్రభుత్వం చీమ కుట్టిన
రీతిలోనైనా స్పందించకపోవడం విడ్డూరం.. రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలు ..కేంద్ర స్థాయి నుంచి వస్తున్న అధికారపార్టీ నాయకులు అప్పుడో మాట ..ఇప్పుడో మాట చెప్పి ఊరుకుంటున్నారు..అది కూడా పరస్పర విరుద్ధ వైఖరులతో గందరగోళాన్ని మరింతగా పెంచుతున్నారు..ఇప్పుడు కూడా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో అమరావతే రాజధానిగా ఉండాలంటూ తీర్మానం చేసి ఊరుకున్నారు..అంతేగానీ దీనిపై కేంద్రం నుంచి నిర్ణయం..కనీసం ప్రకటన వెలువడేలా ఒత్తిడి తెచ్చే సూచన కనిపించడం లేదు.. ఉపరాష్ట్రపతి అంతటి వ్యక్తి రాజధానిపై తన అభిప్రాయాన్ని
వెలిబుచ్చిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంటుందేమోననే ఆశ సర్వత్రా వ్యక్తమైంది.. కాని స్పందన కనిపించలేదు..తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న రీతిలో కేంద్రంలోని పెద్దలు మిన్నకుండిపోతున్నారు..గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడగొట్టిన సమయంలోనూ అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కూడా ఇదే రీతిలో వ్యవహరించింది..సమైక్యాంధ్ర కోసం ఇక్కడ తెలుగు ప్రజలు..పార్లమెంటులో ఆంధ్ర ప్రతినిధులు గొంతులు చించుకుని గీపెట్టినా తెలుగువారి ఆత్మగౌరవాన్ని..
ఆత్మాభిమానాన్ని..
ఆత్మఘోషను కాలరాసిన మన్మోహన్ సర్కార్ నిర్దాక్షిణ్య..ఏకపక్ష నిర్ణయంతో తెలుగువాడి గుండెను ముక్కచెక్కలు చేసేసింది.ఇప్పుడూ ఇంచుమించు అలాంటి కథే..రాజధాని మార్పు అనే మాట ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నోటి నుంచి వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు తలెత్తి ప్రశాంతతకు భంగం ఏర్పడినా కేంద్రం వినోదం చూస్తూ ఉండిపోయింది.ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో పట్టని రీతిలో వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం..అసలు రాజధాని అంశం కేంద్రం పరిధిలో ఉండదా…సాక్షాత్తు ప్రధాని మోడీ అంతటి వ్యక్తి శంకుస్థాపనకు హాజరై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన తెచ్చిన మట్టిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధానికి నీరాజనంగా సమర్పించినప్పుడు రాజధాని
నిర్మా ణానికి కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని రాష్ట్రప్రజలు ఎంతగానో ఆశ పడ్డారు..అనంతర పరిణామాల్లో చంద్రబాబు బీజేపీతో సంబంధాలు తెంచుకోవడం..2014 ఎన్నికల్లో కలిసొచ్చిన సైకిల్..కమలం పొత్తు 2019 నాటికి ఎండగట్టుకుపోవడంతో మొన్నటి జమిలి ఎన్నికలలో అటు బిజెపి ఇటు టిడిపి నష్టపోగా వైఎస్సార్ సీపీ అనూహ్య విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు..అక్కడి నుంచి కథ మారింది..జగన్ సర్కార్ మొదటి నుంచీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నిటిలో తప్పులు వెతుకుతూ పరాకాష్టగా రాజధాని మార్పు నిర్ణయాన్ని ప్రతిపాదించింది..అదిగో..
అక్కడే..అప్పుడే మొదలైంది రగడ..గత కొద్దరోజులుగా రాష్ట్రం మొత్తం మీద ఇదే చిచ్చు..ఆందోళనలు..
అరెస్టులు..భిన్నాభిప్రాయాలు..
ఎన్ని జరుగుతున్నా జగన్ నిర్ణయాన్ని మార్చుకునే సూచనలు కనిపించడం లేదు.. అటు తెలుగుదేశం ప్రాయోజిత సమ్మెగా జగన్ వర్గీయులు ప్రచారం చేస్తున్న అమరావతి రైతుల ఆందోళన చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు..ఇలాంటి పరిస్థితులలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన కేంద్రప్రభుత్వం అటువంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు..
ఇవే పరిస్ధితులు కొనసాగితే రాష్ట్రం పరిస్థితి ఏం కాను..?ఇప్పటికే అమరావతి రాజధానిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి..అక్కడ కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మాణాలు జరిగాయి..జరుగుతున్నాయి.జరుగుతున్న వ్యయంలో కేంద్రం ఇచ్చిన 2500 కోట్ల ప్రజాధనం ఉంది..అయినా కేంద్రం పట్టనట్టు ఉండిపోతోంది..అసలు ఏంటిదంతా అని అధికారస్వరంతో నిలదీయాల్సిన కేంద్రంలోని పెద్దలు మౌనవ్రతం పాటిస్తుండడంతో ఇక్కడ పరిస్థితులు నానాటికీ అధ్వానంగా పరిణమిస్తున్నాయి.ఇంతకాలం పాటు ఆందోళనలు కొనసాగుతుంటే రాష్ట్రప్రగతికి అది అవరోధం కాదా.ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందాన ఉన్నాయి..టిడిపి ఆందోళన ఆపదు..జగన్ సర్కార్ దిగిరాదు..ఇప్పుడిది రాజధాని సమస్యగా కాక చంద్రబాబు..జగన్..టిడిపి..
వైఎస్సార్ పార్టీ ప్రతిష్టల
అంశంగానే గాక రెండు కులాల మధ్య రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారిపోయింది..జరుగుతున్నది ఎటుపోయి ఎక్కడికి
దారితీసినా ప్రస్తుతానికైతే నష్టపోతున్నది ప్రజలే..అందుకే పరిస్థితులు మరింతగా విషమించేలోగా కేంద్రం జోక్యం చేసుకోవడం మంచిది…మనలో మన మాట..ఇలాంటి పరిస్థితులు గుజరాత్ లోనో.. మహారాష్ట్రలోనో ఏర్పడితే మోడీ..అమిత్ షా ఇలాగే ఉండిపోతారా..!?అయినా ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి
ఆరో వేలా!?