ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ ‘ఫ్యాన్‌’ గాలి వీస్తోంది…

  • ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ ‘ఫ్యాన్‌’ గాలి వీస్తోంది…

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బరిలో ఉండటం ద్వారా బహుముఖ పోటీ ఉన్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి పోటీ వైఎస్సార్‌సీపీ– టీడీపీ మధ్య మాత్రమే. సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి–ద హిందూ నిర్వహించిన సర్వేలోనూ వైఎస్సార్‌సీపీకి 46 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 36 శాతం వస్తాయని తేల్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో మద్దతిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించడం వ్యూహాత్మకంగా ఆ పార్టీకి మేలు చేసేదే. హోదా రాకపోయేందుకు కేంద్రం కారణమన్న తెలుగుదేశం విమర్శలకు ప్రధాని మోదీ గట్టి సమాధానం ఇవ్వడం, కేంద్రం తగినన్ని నిధులిచ్చినా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లి టీడీపీ విమర్శలు చేయడం ఏం సబబని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, నేతల అవినీతి, రాజధాని నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలు, పోలవరం నిర్మాణం పూర్తికాకపోవడం, విభజన హామీల అమల్లో వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ తన ముఖ్య ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. తాజా ఎన్నికల్లో వైస్సార్‌సీపీ రాయలసీమ ప్రాంతంలో తన బలాన్ని మరింత పెంచుకునే అవకాశాలున్నాయి.
♦ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తా ప్రాంతంలోని అరకు (ఎస్టీ)తోపాటు ఒంగోలు, నెల్లూరు స్థానాలను నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
♦ టీడీపీ నుంచి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన పండుల రవీంద్రబాబు.. అమలాపురంలో పార్టీకి బలం కానున్నారు. అలాగే, కాండ్రేగుల సత్యవతి అనకాపల్లి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. తద్వారా టీడీపీకి రెండు స్థానాలు తగ్గనున్నాయన్నమాట.
♦ రాయలసీమలో వైఎస్సార్‌సీపీ ఈసారి గత ఎన్నికల కంటే మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోనుంది.
♦ బాపట్లలో టీడీపీ ఎంపీ మల్యాద్రి శ్రీరామ్‌కు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నందిగమ్‌ సురేశ్‌ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.
♦ గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.వేణుగోపాలరెడ్డి మధ్య పోటీ నెలకొంది.
♦ కాకినాడ, రాజమండ్రి, నరసరావుపేటల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణపు పోటీ ఉంది. ఈ మూడు స్థానాల్లో కాపు ఓటర్లు కొంత వరకు జనసేనవైపు మళ్లడం ద్వారా టీడీపీకి గండి పడినట్టే.
♦ గత ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి బీజేపీ గెలుపొందగా.. ఈసారి  కాషాయ పార్టీకి కష్టమే.
♦ 2014 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 15 స్థానాల్లోనూ, వైఎస్సార్‌సీపీ ఎనిమిది స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లోనూ గెలుపొందిన విషయం తెలిసిందే.  రాయలసీమలోని మొత్తం ఎనిమిది స్థానాల్లో ఐదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా… కోస్తాలో టీడీపీ ఎక్కువ సీట్లు సాధించింది.

 

తెలంగాణ:  కారు.. పదహారు
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు పోటీ జరుగుతుండగా, పరిస్థితులన్నీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావుకు పేరుండటం ఇందుకు ఒక కారణం. గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు 11 స్థానాలు దక్కగా.. ఆ తరువాత టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముగ్గురు అధికార పక్షంవైపు మళ్లడంతో ఆ పార్టీ బలం 14కు పెరిగింది. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాల్లోనూ, ఒక స్థానంలో ఆలిండియా మజ్లిస్‌ ఇత్తేహదుల్‌ ముస్లమీన్‌ తరఫున అసదుద్దీన్‌ ఒవైసీ పోటీ చేస్తున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఒక అవగాహన మేరకు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 13 శాతం వరకూ మున్న ముస్లింల ఓట్లు టీఆర్‌ఎస్‌ వైపు మళ్లేందుకు అవకాశాలు పెరుగుతాయి. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, రైతుబంధు తదితర పథకాల దన్నుతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ విశ్వసిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలు లభించే అవకాశం ఉంది.