అవును.. ఆ స్టూడియో అమ్మేస్తున్నాం!

బాలీవుడ్ దిగ్గజ నటుడు, నిర్మాత అయిన రాజ్‌కపూర్‌కు చెందిన ఆర్కే స్టూడియోస్‌ను అమ్మేస్తున్నట్లు అతని తనయుడు రిషి కపూర్ చెప్పాడు. గతేడాది ఈ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగి విలువైన వస్తువలు, సెట్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. దీనిని పునర్నిర్మించినా తాము అనుకున్న లాభాలు రావని నిర్ణయించిన తర్వాతే తమ కుటుంబమంతా కలిసి అమ్మేయాలని నిర్ణయించినట్లు రిషి తెలిపాడు. నిజానికి ఆ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరగక ముందు కూడా భారీ నష్టాల్లో నడుస్తుండేదని రిషి చెప్పాడు. అత్యాధునికి టెక్నాలజీ సాయంతో స్టూడియోను రెనొవేట్ చేయాలని మొదట భావించాం. కానీ అది సాధ్యం కాదని తేలింది. స్టూడియో విషయంలో మాకు చాలా సెంటిమెంట్ ఉన్నా.. నష్టాలు వస్తాయని తెలిసి పునర్ నిర్మించడం వృథానే అవుతుంది. దీంతో అందరం కలిసి అమ్మేయాలని నిర్ణయించాం.

టీవీ సీరియళ్లు, సినిమాల కోసం బుకింగ్స్ ఉన్నా.. వాటి నుంచి ఆశించినంత మొత్తం రావడం లేదు అని రిషీ చెప్పాడు. గతేడాది జరిగిన అగ్ని ప్రమాదంలో రాజ్‌కపూర్‌కు చెందిన ఎన్నో జ్ఞాపకాలు, ఆర్కే ఫిల్మ్స్‌కు కాస్ట్యూమ్స్ పూర్తిగా తగలబడిపోయాయి. ఆర్కే ఫిల్మ్స్ బర్సాత్ (1949), ఆవారా (1951), బూట్ పాలిష్ (1954), శ్రీ 420 (1955), జాగ్‌తే రహో (1956)లాంటి హిట్ మూవీస్‌ను నిర్మించింది. ఇక జిస్ దేశ్ మె గంగా బెహతీ హై (1960), మేరా నామ్ జోకర్ (1970), బాబీ (1973), సత్యమ్ శివం సుందరం (1978), ప్రేమ్ రోగ్ (1982), రాజ్‌కపూర్ నటించిన చివరి సినిమా రామ్ తేరీ గంగా మైలీ (1985)లాంటి సినిమాలు ఈ స్టూడియోలోనే చిత్రీకరణ జరుపుకున్నాయి.
TAGS:RK Studios , RK Films , Raj Kapoor , Rishi Kapoor , Bollywood