అయోధ్య రామాలయంపై మీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయండి: అమిత్ షా

అయోధ్య రామాలయంపై మీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయండి: అమిత్ షా

అయోధ్య రామాలయం నిర్మాణంపై మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, రాముడు జన్మించిన స్థలంతో ఆయన ఆలయాన్ని నిర్మించాలని బీజేపీ కోరుకుంటోందని చెప్పారు. రామాలయాన్ని నిర్మించాలా? వద్దా? అనే విషయాన్ని ఈ రెండు పార్టీలు స్పష్టంగా చెప్పాలని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లోని గూండాలపై బీజేపీ ఉక్కుపాదం మోపిందని… ల్యాండ్ మాఫియా సమస్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్ చెక్ పెట్టారని అమిత్ షా అన్నారు. యోగి పాలనలో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. పైన మోదీ ఉన్నారని… కింద యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని… రానున్న ఎన్నికలు మోదీకి మిగిలిన వారికి మధ్య జరగబోతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలే తమ పార్టీకి ఘన విజయం కట్టబెడతారని… తమ పార్టీకి నాయకుల అండ అవసరం లేదని చెప్పారు.