అయోధ్య నగరంలో టెన్షన్.. టెన్షన్..

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నేటితో 26 ఏళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 1992 డిసెంబర్ 6న హిందూత్వ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఇవాళ ‘‘శౌర్య దివస్’’, ‘‘విజయ్ దివస్’’గా జరుపుకుంటున్నాయి. మరోవైపు ముస్లిం వర్గాలు ఇవాళ ‘యావుమ్ ఈ ఘమ్’ (సంతాప దినం), ‘యావుమ్ ఈ స్యాహ్’ (చీకటి రోజు)గా పాటిస్తున్నాయి. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

బహళ అంచెల భద్రతలో భాగంగా… పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా అణువణువూ తనిఖీ చేస్తున్నారు. సినిమా హాళ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు సహా అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అయోధ్యలో ప్రవేశించే వాహనాలపై నిఘా వేసేందుకు నగర శివార్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో యధాతథ స్థితి కొనసాగించాలంటూ బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.