అమీర్‌పేట – ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం

నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ – అమీర్‌పేట మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. గవర్నర్ నరసింహన్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కలిసి అమీర్‌పేట – ఎల్బీనగర్ మెట్రో రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట నుంచి పంజాగుట్ట, అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట మీదుగా ఎల్బీనగర్ వరకు మెట్రో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం ఈ ప్రధాన మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట, అక్కడి నుంచి మియాపూర్ దాకా 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలందుతున్నాయి. రోజూ సగటున 75 వేల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట వరకు 16 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రావడంతో నగరంలో మెట్రో ప్రయాణం మొత్తం 46 కిలోమీటర్లకు విస్తరించింది. దీంతో దేశంలో ఢిల్లీ తర్వాత అతి పొడవైన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పింది. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది. తాజాగా చెన్నైని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) వెనుకకు నెట్టివేసి రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటికే మెట్రో ప్రయాణం చేస్తున్నవారితో కలిపితే కొత్త మార్గంలో ప్రయాణించేవారి సంఖ్య లక్షన్నరకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎల్బీనగర్- అమీర్‌పేట మెట్రో ప్రత్యేకత
హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల పొడవున మెట్రో సేవలందించాలన్నది లక్ష్యం. ఇప్పటికే నాగోల్ నుంచి మియాపూర్ దాకా 30 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉన్నది. నేటి నుంచి అమీర్‌పేట- ఎల్బీనగర్ కారిడార్‌లో మిగిలిన 16 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 29 కిలోమీటర్ల మొదటి కారిడార్ మొత్తం (మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు) పూర్తయింది. కారిడార్ 1 మిగతా రెండు కారిడార్ల కంటే అతిపెద్దది కావడంతోపాటు మొత్తంగా ఈ మార్గంలో 27 స్టేషన్లు ఉండటం విశేషం. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లదలుచుకున్నవారు ఇక మీదట ఎక్కడా ఇంటర్‌చేంజ్ కానవసరం లేకుండానే గమ్యం చేరుకోవచ్చు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ చేరుకోవాలంటే బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా కనీసం రెండుగంటలు పడుతుంది. కాని మెట్రో ద్వారా కేవలం 50 నిమిషాల్లో చేరుకునే వీలు కలుగుతుంది. మెట్రో రైలు తొలుత సగటున 32 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. మొదట్లో రైలు ఫ్రీక్వెన్సీని ప్రతి 5 నిమిషాలు, తర్వాత 2 నిమిషాలుగా నిర్దేశించారు. అసెంబ్లీ నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ వరకు 5 కి.మీ. మార్గాన్ని దక్కనీ రాతి పూతతోనూ, ఇండో-పర్షియన్ కళాత్మక శైలి రైలింగ్‌తోనూ, ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే రహదారి ఫర్నిచర్‌తోనూ హెరిటేజ్ ప్రిసింక్ట్‌గా మారుస్తున్నారు.