అనంతపురం ఎస్పీని బెదిరించిన రమణ దీక్షితుల సన్నిహితుడి అరెస్ట్

కేంద్ర మంత్రి ఓఎస్డీగా పరిచయం

ఎస్పీ, సీఐకి ఫోన్ చేసి బెదిరింపులు
అరదండాలు వేసిన పోలీసులు
టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితుల సన్నిహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం ఎస్పీ, సీఐని ఫోన్లో బెదిరించిన ఆరోపణలపై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ అనంతపురం ఎస్పీ, సీఐకి ఫోన్ చేసి తాను కేంద్రమంత్రి ఓఎస్డీని అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఓ చర్చి విషయంలో తాను చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరించాడు.

దీంతో, అతడు ఎవరన్న విషయాన్ని పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు అతడిని రమణ దీక్షితులు సన్నిహితుడిగా గుర్తించారు. గుంటూరులో అతడిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. నేటి మధ్యాహ్నం అనిల్‌ను మీడియా ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది.