అధిక ధరలపై అడ్డంగా బుక్కయిన ఐనాక్స్… సాధారణ ప్రేక్షకులుగా వెళ్లి కేసు నమోదు!

ఎంఆర్పీ నిబంధనలను పాటించని మాల్స్
టీవీ చానల్స్ కథనాలతో కదిలిన అధికారులు
పలు మాల్స్ పై దాడులు
గరిష్ఠ చిల్లర ధరలకు మించి సినిమాహాల్స్, మల్టీ ప్లెక్సుల్లో అమ్మకాలు సాగించేందుకు వీల్లేదని తెలంగాణ సర్కారు ఆదేశించినా వినని థియేటర్లపై చర్యలు ప్రారంభం అయ్యాయి. నిన్నటి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాగా, ఏ మల్టీప్లెక్స్ యాజమాన్యం కూడా వాటిని పట్టించుకో లేదని ఆరోపణలు వచ్చిన వేళ, ఈ ఉదయం లీగల్ మెట్రాలజీ అధికారులు, సాధారణ సినీ ప్రేక్షకుల మాదిరిగా థియేటర్లలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. కాచిగూడలోని ఐనాక్స్ థియేటర్ లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న అధిక ధరలను చూసి అవాక్కైన అధికారులు కేసు నమోదు చేశారు. ఇక్కడ ధరల పట్టికను ఏర్పాటు చేయలేదని, బయటి ధరలతో పోలిస్తే అధిక ధరలను వసూలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. కాగా, హైదరాబాద్ పరిధిలోని మరిన్ని మాల్స్ పై అధికారులు దాడులు జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ దాడులపై మరింత సమాచారం తెలియాల్సివుంది.