అక్టోబర్‌లో షెడ్యూల్!

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. ముసాయిదా జాబితాకు సమయాన్ని కుదించడం, ప్రతినిత్యం జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, సంబంధిత జిల్లా పోలీస్ ఆఫీసర్లతో సమీక్షల నిర్వహణ, ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చివరిదశకు చేరుకోవడం గమనిస్తే.. అక్టోబర్ మొదటిపక్షంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు, నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు వివిధ జిల్లాలకు ఈవీఎంలు తెప్పిస్తున్న అధికారులు.. వాటిని ఉపయోగించే విషయంలో జిల్లా రిటర్నింగ్ అధికారులకు, డీఈవోలకు శిక్షణ కార్యక్రమాలను ముమ్మరంచేశారు. ప్రధానంగా ఓటర్ల నమోదు, సవరణలకు ఈ నెల 25 వరకు గడువును కుదించి, పనులు వేగవంతం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టింది. జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 4 వరకు గడువు ఇచ్చింది. అనంతరం అక్టోబర్ 7న ఓటర్ల జాబితాను ముద్రిస్తారు. మరుసటిరోజు ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదలచేస్తుంది. ఇదే తుది జాబితాగా పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో షెడ్యూలు ప్రకటన మొదలుకుని.. పోలింగ్, కౌంటింగ్, విజేతలకు ధ్రువీకరణ పత్రాల అందజేతవరకు.. మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. అంటే దాదాపు నవంబర్ నెల చివరి నాటికి తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తై, కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలున్నాయని చెప్తున్నారు.
ఈవీఎంలపై అధికారులందరికీ శిక్షణ
రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ప్రవేశపెడుతున్న ఈవీఎంల సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. వీవీప్యాట్లపై అధికారులందరికీ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వీరంతా కిందిస్థాయిలో బూత్ లెవల్ అధికారులకు శిక్షణనిస్తారని తెలిపారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రజత్‌కుమార్.. ఎన్నికల నిర్వహణ, అందుకు ఏర్పాట్లు, కొత్త సాంకేతిక విధానాలు, ఓటర్ల నమోదు ప్రక్రియపై వివరించారు. ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఫలానా అభ్యర్థికే ఓటువేస్తామంటూ ప్రతిజ్ఞలు, తీర్మానాలు చేస్తున్నారన్న ప్రశ్నకు.. అవి ఓటర్ల వ్యక్తిగత అంశాలని చెప్పారు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పుకోవటంపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, బలవంతంగా ఎవరైన ప్రతిజ్ఞ, తీర్మానం చేయిస్తే అప్పుడు అది నేరంగా పరిగణిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

వేగంగా ఓటరు నమోదు కార్యక్రమం
ఓటరు నమోదు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని రజత్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటుచేయడం వల్ల స్పందన అధికంగా ఉందన్నారు. ప్రతిరోజూ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇంతకుముందు ఓటర్ల నమోదు ప్రక్రియలో ఇబ్బందులుండేవని, వాటిని సవరించేందుకు 10 రకాల అప్లికేషన్లు అందుబాటులో పెట్టామని చెప్పారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఓటరు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు అందిన వెంటనే రిటర్నింగ్ అధికారి స్పందిస్తారని వెల్లడించారు. ఓటరు లిస్టుపై రాజకీయ పార్టీలు న్యాయస్థానాలకు వెళితే చట్టప్రకారంగా నడుచుకుంటామని రజత్‌కుమార్ తెలిపారు. ఓటర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదా ఫిర్యాదులకు 1800-599-2999 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించవచ్చని ఆయన వివరించారు.
ఎన్నికలు ఎప్పుడనేది మా పరిధి కాదు
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడనే అంశం తమ పరిధిలోకి రాదని, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఎన్నికలు జరుగుతాయని రజత్‌కుమార్ స్పష్టంచేశారు. ఎన్నికల తేదీల ఖరారుపై ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయితే ఆటోమెటిక్‌గా సీఈసీ తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రజలు ఓటు వేయడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.