అందరూ స్పందించాలి.. లేకపోతే ఏపీ ప్రజలకు పౌరుషం లేదనుకుంటారు: పవన్ కల్యాణ్

అందరూ స్పందించాలి.. లేకపోతే ఏపీ ప్రజలకు పౌరుషం లేదనుకుంటారు: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ను చాలా అన్యాయంగా విభజించారని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని… రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని సూచించారు. ఎవరు ఎన్ని చెప్పినా… రాష్ట్రానికి అన్యాయం జరిగిన విషయం మాత్రం వాస్తవమని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత ఇవ్వాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం కోసం మాజీ ఎంపీ ఉండవల్లి చేస్తున్న కృషి గొప్పదని అన్నారు. విజయవాడలో ఉండవల్లి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎప్పుడో జరిగిపోయిన విభజన గురించి ఉండవల్లి ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని… భవిష్యత్తు తరాల కోసం పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండటం సరికాదని… మనం మౌనంగా ఉంటే ఏపీ ప్రజలకు పౌరుషం లేదని అనుకుంటారని చెప్పారు.