అంత సవ్యంగానే పారదర్శకంగానే మూల్యాంకనం

Share This

హైదరాబాద్: ఇంటర్ ఫలితాలపై  విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ కోరారు.  క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తప్పుచేసినవారికి మెమో జారీచేయడంతోపాటు జరిమానా విధిస్తామని  తెలిపారు. ఇంటర్ బోర్డు పారదర్శకంగానే పనిచేస్తున్నదని స్పష్టంచేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడా క్షేత్రస్థాయిలో తప్పులు జరిగాయని, ముగ్గురు విద్యార్థుల మెమోల్లో తప్పులువస్తే వాటిని సవరించామని చెప్పారు. తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 21 వేల జవాబు పత్రాలు గల్లంతైనట్టు తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, నిజానికి ఏ ఒక్క పేపరూ గల్లంతు కాలేదని స్పష్టంచేశారు. ఏ జవాబుపత్రం అడిగినా చూపిస్తామని చెప్పారు.

నవ్య అనే విద్యార్థిని విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను అశోక్ వివరిస్తూ.. ఓఎంఆర్ షీట్లో మార్కుల స్థానంలో బబ్లింగ్ చేయడంలో పొరపాటు వల్ల 99 మార్కులు వస్తే 0 మార్కులు వచ్చినట్టు వేశారని తెలిపారు. మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి వెంటనే జవాబు పత్రం తీసుకొచ్చి చూడగా ఆమెకు 99 మార్కులు వచ్చినట్టు తేలిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు పహారా ఉంటుందని, అందువల్ల పేపర్లు గల్లంతయ్యే అవకాశమే లేదని వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షకు హాజరుకానివాళ్లు ఉత్తీర్ణులైనట్టు, హాజరు అయినవారు ఫెయిల్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు.

అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేయించినట్టు వస్తున్న ఆరోపణలు కూడా నిరాధారాలని చెప్పారు. అర్హులైన బోర్డు అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించినట్టు తెలిపారు. విద్యార్థులు సెంటర్ మారడంవల్లే ఏఎఫ్, ఏపీ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయని వివరించారు. ఇంటర్ బోర్డుపై ఈ మధ్యకాలంలో అసత్య ప్రచారం జరుగుతున్నదని అన్నారు. పారదర్శకంగా వ్యవహరించి, నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించామని తెలిపారు.   ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డే ఇంటర్ పరీక్షలను చేపట్టే పక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలు తీసుకున్నామని అశోక్ వెల్లడించారు. 15 ఏండ్లుగా మన్టెక్ ఇన్ఫో సంస్థ సాంకేతిక సేవలు అందిస్తున్నదని, పదిహేనేండ్లుగా ఒకే సంస్థ సేవలందిస్తున్నందున దానిని మార్చాలని టెండర్లు పిలువగా.. గ్లోబరీనా సంస్థ నుంచి టెండర్ వచ్చిందని, నిబంధనలకు అనుగుణంగానే ఆ సంస్థకు టెండర్ కేటాయించామని వివరించారు.

ఆ సంస్థ మూడేండ్లు మాత్రమే ఇంటర్ బోర్డుకు సేవలు అందిస్తుందని, ఆ తర్వాత పూర్తిగా ఇంటర్‌బోర్డే సొంతంగా సాంకేతిక సేవలను సమకూర్చుకుంటుందని తెలిపారు. రీ వాల్యూయేషన్ గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని, రీవాల్యూయేషన్లో మారిన మార్కులను విద్యార్థుల ఈమెయిల్‌కు పంపుతామని చెప్పారు. . తప్పులకు ఎగ్జామినర్, స్క్రూటినైజర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే పొరపాటును సరిదిద్ది ఆ విద్యార్థినికి సమాచారం ఇచ్చామని చెప్పారు.