అంత్యక్రియల స్థలిపై వివాదం

ప్రభుత్వ వివరణ దాఖలుకు హైకోర్టు ఆదేశం
మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలన్న డీఎంకే
కుదరదన్న తమిళనాడు సర్కారు
హైకోర్టును ఆశ్రయించిన పార్టీ
దివంగత నేత కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాల్సిన స్థలం విషయంలో డీఎంకేకు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలన్న డీఎంకే డిమాండును సర్కారు తోసిపుచ్చింది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. అర్ధరాత్రి న్యాయమూర్తులు విచారించారు. బుధవారం ఉదయం 8 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఇతర నేతల అంత్యక్రియలకు స్థలం ఇచ్చినట్టుగానే సీనియర్‌ నేత కరుణానిధికి ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రులు సి.రాజగోపాలాచారి, కె.కామరాజ్‌ల స్మారకాల పక్కన భూమి ఇస్తామని తొలుత ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డీఎంకే.. మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. కరుణానిధి అందించిన సుదీర్ఘ సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన అంత్యక్రియలకు మెరీనాబీచ్‌లో అన్నాదురై సమాధి ప్రాంగణంలో చోటు ఇవ్వాలని స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామికి లేఖ రాశారు. మద్రాస్‌ హైకోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉండటం, న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ వినతిని ఆమోదించలేమని ప్రభుత్వం తెలిపింది. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని రాజాజీ, కామరాజ్‌ స్మారకాల పక్కనే రెండెకరాల భూమిని ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. గతంలో ఎం.జి.రామచంద్రన్‌, జయలలితలకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయి. వారి స్మారకాలనూ ఏర్పాటుచేశారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలంటూ మంగళవారం రాత్రి డీఎంకే కార్యకర్తలు నిరసనకు దిగారు. డీఎంకే తరఫు న్యాయవాదులు.. మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.డి.రమేశ్‌ నివాసానికి వెళ్లి అత్యవసర పిటిషన్‌ దాఖలుకు అనుమతి కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి.. అడ్వొకేట్‌ జనరల్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.

పాత పిటిషన్‌ ఉపసంహరించుకున్న దురైస్వామి: అర్థరాత్రి దాటాక జస్టిస్‌ రమేశ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.సుందర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మెరీనా బీచ్‌లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు జరపరాదంటూ హైకోర్టులో గతంలో పిటిషన్‌ వేసిన ఎం.దురైస్వామి హుటాహుటిన జస్టిస్‌ రమేశ్‌ నివాసానికి చేరుకున్నారు. ‘నా పిటిషన్‌ను ఉపయోగించుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకుంటోంది. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరై నా కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పదలచుకున్నా. కరుణానిధికి అన్నాదురై సమాధి పక్కనే అంత్యక్రియలు జరపాలి’ అని దురైస్వామి చెప్పారు.